Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page

గోవింద భగవత్‌ పాదులు

సంస్కృతం దేవభాష, గీర్వాణుల భాష కాబట్టి అది గైర్వాణి. (గీర్వాణులనగా దేవతలు) దండి అనే ఆయన రచించిన కావ్యాదర్శనంలో.

'సంస్కృతం నామ దైవీ వాక్‌' అని ఉంది. 'సంస్కృతం దేవలోకంలో ఎక్కువ వాడుకలో ఉంది' అని మహాభాష్యం చెబుతూంది. సంస్కృతం అనే మాటకే సంస్కారం చేయబడినది అని అర్ధం. నవ వ్యాకరణాలచే సంస్కృతం సంస్కరించబడ్డది. దీనికి పాతకాలపుపేర్లు దేవభాష, దేవవాక్కు అనేవి. అందరూ సంస్కృతంలోనే మాటలాడవలే నని నియమం. 'న వ్లుెచ్ఛిత వై, నాప భాషిత వై' వ్లుెచ్ఛ భాష వ్యక్త సంబంధం కలది కాదు. తక్కిన భాషలన్నీ సంస్కృత భాషాభేదాలే. వ్యాకరణ శుద్ధి లేని భాష లెన్నో ఉన్నవి. చిన్న పిల్లలు కూడా సంస్కృతాభ్యాసం చేయాలి. కాని ఆ భాష మాట్లాడరాదు. మాటాడితే అది వ్యాకరణబద్ధంగా ఉండాలి. ఇట్లా వ్యాకరణంచే సంస్కృతమైనది సంస్కృతం. గౌడపాదులు వ్యాకరణ భాష్యం చేసిన పతంజలి దగ్గరకు శిష్యులై వచ్చి శాపవశంచే బొమ్మరాకాసి అయిపోయారు. మరి తమ దగ్గరకు చంద్రశర్మ రాగా గురువుగారి ఆజ్ఞ ననుసరించి సరియయిన శిష్యునికోసం కనిపెట్టుకొని ఉన్న గౌడపాదులు, చంద్రశర్మకు వ్యాకరణం దత్తం చేశారు. వారు దానిని విని రావాకులలో వ్రాసిపెట్టుకున్నారు.

చంద్రశర్మ వ్యాకరణం పూర్తిగా అయింది. గౌడులకు శాపనివృత్తి అయింది. 'నాకిక వైరాగ్యం శరణ్యం, ఆత్మను ధ్యానించాలి. దానిని తెలుసుకోవడానికి ఉత్తముడైన గురువును అన్వేషించాలి' అని గౌడపాదులు ఆలోచించి ఆలోచించి సమకాలికులలో అట్టివారు, జన్మతోనే జీవన్ముక్తలయినవారు ఎవరా అని తఱచిచూడగా శుక్లాచార్యులు అని అనుకొన్నారు. శుకులు పుట్టుకతోనే ఆత్మజ్ఞాని. యత్నమే లేదు. యజ్ఞాద్యనుష్టానాలు అంతకు ముందే లేవు.

కర్మ శేషఫలంగా పుట్టుక ఏర్పడుతుంది. ఇట్లా ఏర్పడిన పుట్టువులలో సత్‌ కర్మలు చేసి తత్ఫలరూపంగా చిత్తశుద్ది పొంది దానిమీదట జ్ఞానమును అందుకోవాలి. ఇది ఏదీ లేక పుట్టే పుట్టటంతోనే శుకు లెట్లా జ్ఞానులయారు? జ్ఞానులకుకూడా ప్రారబ్ధకర్మ ఉన్నంత వరకూ దేహం ఉంటుంది. అటు పిదప విదేహముక్తి దొరకుతుంది. సంగతులిట్లా ఉండగా శుకులు మాత్రం పుట్టుకతోనే జ్ఞాను లెట్లా ఐనారు? వీరివంటివా రింకెవరయినా ఉన్నారా?

వామదేవులు గర్భములోనే జ్ఞానులట! వారు గర్భంలో ఉన్నప్పుడే

'గర్భే ను సన్నన్వేషా మవేద మహం దేవనా జనిమాని విశ్వా

శతం మా పుర రాయసీ రరక్షన్‌ అథశ్యేనో జవసా నిర దీయమ్‌'

(ఇతి గర్భ ఏవ త చ్ఛ యానో వామదేవ ఏవమువాచ)

- ఐతరేయోపనిషత్‌.

అని చెప్పారు. ఈ అందరు దేవతలయూ కోటానకోట్ల పుట్టుకలను గర్భమునుండే నే నెరిగున్నాను' అని వారు సెలవిచ్చారు. 'ఇంతకుమునుపు నే నెల్లా ఉన్నాను? కోట్లకొలది జన్మలు నన్ను ఇనుపకోటలు బంధించినటులు బంధించి ఉంచినవి. ఇపుడు నాకు రెక్కలు వచ్చినవి. బంధాలనుండి బయటపడ్డాను. ఇపుడు నాకు అన్ని విధాలయిన జన్మలూ తెలుస్తూఉన్నవి' అని వామదేవు లన్నారు. వ్యాసభగవానులుకూడా-



శాస్త్ర దృష్ట్యా తూపదేశో వామదేవవత్‌ - బ్రహ్మసూత్ర-1-1-30.

అని వామదేవుల దృష్టాంతం చెప్పారు. ముక్తుల కుదాహరణంగా శుకులనూ వామదేవులనూ చెబుతారు. శ్రుతులు కూడా వీరిని జన్మతః ముక్తులని చెపుతవి.

గోవింద భగవత్పాదుల స్తుతి గురు పరంపరాస్తోత్రంలో శుకులను గూర్చి,

జననీ జఠరా దివ చ్యవన్‌ యో

జగతో నా2ద్రవ దాత్మవిద్‌ విపద్భ్యః|

అనహం తమహం త మాత్మవంతం

భగవంతం శుక మాశ్రయే ప్రశాంతమ్‌||

- గురురత్నమాలికా.

అని ఉన్నది. ఈ శ్లోకంలో శుకులు తల్లి కడుపులో నుండి వెలువడునపుడే అహంకారరహితులనిన్నీ ఈ ప్రపంచంలో ఏ ఉపద్రవానికీ వెరవనివా రనిన్నీ చెప్పబడినది.

భాగవతంలో శుకునిగూర్చి చెప్పబడిన ఒకానొక శ్లోకం చెబుతున్నాను.

యం పవ్రజంత మనవేత మపేత కృత్యం

ద్వైపాయనో విరహకాతర ఆజుహావ|

పుత్త్రేతి తన్మయతయా తరవో2భినేదు

స్తం సర్వభూత హృదయం మునిమానతో2స్మి||

- భాగవతం

మనం ఏదయినా ఒక చోటికి వెళతాం, ఏదోపనిమీద ఆ పని కాగానే ఆ చోటు వదిలేసి బయలు దేరతాం. శుకులు కూడా వచ్చిన పని అయిపోయిందని యజ్ఞోపవీతం వేయకముదే బయలుదేరారు. గురు పరంపరాస్తోత్రంలో ప్రపంచానికి వెరవని వారు అని ఉన్నది. ఈ శ్లోకంలో బయలుదేరారని అనడానికి తగినటులు జందెము వేయడానికి ముందే అని చెప్పబడి ఉన్నది. బయలుదేరడానికి శిశువుకు కాలుసేతులు నడవగలంత బలంగానూ ధృఢంగానూ ఉండాలిగదా.

ద్వైపాయను లంటే వ్యాసులవారు. వారు ఆత్మజ్ఞానంతో పుట్టలేదు. వారికి పుత్రుని మీద వాత్సల్యం ఎక్కువ. కొడుకునె విడిచిపెట్టి ఉండలే నని ఆయనకు వెరపుకలిగింది. అదుచేత శుకులు బయలుదేరగానే వ్యాసులు 'నాయనా' అని ఎలుగెత్తి పిలిచారు. శుకులు తమకు కావలసిన కార్యమేదీ లేదని తండ్రి యింటి నుండి బయలుదేరారు. ఎంచేత?

కార్యమంటే? ఏదో ఒకదానిని సంపాదించుట. మరి యొకదానిని వదిలిపెట్టు. సమస్తకార్యాలూ ఈ వరుసనే ఉంటవి. లేనిదానిని సంపాదించాలి. ఉన్నదానిని వదిలిపెట్టాలి. పనికి మాలిన భృత్యులను బహిష్కరించాలి. పని చేసేవారిని ఆదరించాలి. శత్రువులను జయించాలి. మిత్రులను సంపాదించుకోవాలి. ఇట్లా ప్రపంచంలో సమస్త కార్యాలు హానోపాదాన రూపాలుగా అనగా పట్టువిడుపులుగా ఉన్నవి. ఈ కార్యాలన్నిటిలోనూ గ్రహణ పరిత్యాగాలు చూపట్టుతవి. ఇట్లా ఉండటమే కార్యం. డబ్బు సంపాదించవలె నంటే ఏదో ఒక పని చేయాలి. దుఃఖ నివృత్తికీ సుఖప్రాప్తికీ సమస్త కార్యాలూ చేయబడతవి. గ్రహణంతోగాని త్యాగంతోగాని త్రోసివేయనూ లేము. మనకంటే వేరు వస్తువులున్న వనువారికే గ్రహించుటగాని త్యజించుటకుగాని. అట్టివస్తువులను గ్రహించుటకుగాని త్యజించుటగాని వారు కార్యాలు చేస్తారు. దృశ్యమగు ప్రతి వస్తువూ మనమే అని అనుకొన్నపుడు మనకు కార్యమేమున్నది? వేరు అనేది లేనపుడు దేనిని గ్రహించడం? మరి దేనిని వదలడం? అపుడీ రెండూ లేవు. కార్యమూ లేదు. ఉపద్రవము, ఆకలి, దప్పి, సుఖము, దుఃఖము ఇత్యాదులన్నీ మనకన్న వేరు కావని తోచినపుడు మనకు కాగల కార్యమే మున్నది?

చర్మం నల్లగా ఉంటే నల్లని వాళ్లం అని చెప్పుకొంటారు. తెల్లగా ఉంటే తెల్లని వాళ్లని చెప్పుకుంటారు. అది గర్వపడడానికి కూడా ఒక కారణమవుతుంది. అంటే మన చర్మమే మనం అని భావించామని అర్థం. సరే, మనము మనము, నేను నేను, అని తోస్తూందే - అట్లా తోచటములో 'ఈ చర్మం మనం' అని కూడా తోచినప్పుడు 'అంతా మనం' అని ఎందులకు తోచకూడదు? అట్లా మనం తోచకుండా ఉన్నాం. అంతా మనమే అని మనం తెలుసుకోలేకుండా ఉన్నాం. అది తెలిసికొంటే ఇక వేరే కార్యం ఏదీ? మనకంటే వేరే వస్తువుంటే కదా దానిని గ్రహించడమో విడనాడడమో, అంతా మనంగానే ఆత్మతత్త్వంగానే సత్యవస్తువుగానే ఉంటే అపుడు కార్యమేదీ లేదు.

'అంతా మనమే' అని భావించినవారు శుకులు. అనగా అన్నిటిలోనూ నేను ఉన్నానని అర్థం. వారు ఇల్లు వెడలిపోతూ వుంటే వ్యాసులవారు 'నాయనా' అని పిలిచారు. ఎవరుబదులు చెపుతారు? అంతా తానే ఐపోయె. దాని చేత వ్యాసులవారి పిలుపులకు అంతా అంటే సమస్తమూ బదులు పలకాలి. చెట్లన్నీ 'ఏమీ', మృగా లన్నీ 'ఏమీ ఎందుకూ'? అని అడిగినవి. అన్ని ప్రాణులున్నూ శుకులుగానే తానుగనే ఉండె. అంతయూ తానుగనే ఉండినందున ఆయనకు చేయవలసిన పనియేమీ లేకపోయింది. అట్టి శుకాచార్యుల అనుగ్రహం పొందాలని గౌడసాదులనుకొన్నారు. శ్రీ శుకాచార్యులవారు హిమాలయములో బదిరాకశ్రమంలో ఉన్నారని తెలిసికొన్నారు. తెలిసికొని వారి కడకు వెళ్లారు. వారి దగ్గర సన్న్యాసం పుచ్చుకొన్నారు. అపుడు వారు గౌడపాదాచార్యులు అని పేరు పడ్డారు. ఆచార్య పరంపరలో వీ రొకరు. ఆచార్య పరంపర అంటే ఏమి?

ప్రపంచంలో ఉన్న అందరలోనూ చైతన్యం ఉన్నది. అదియే నిజవస్తువు. సత్యవస్తువు. ఆ చైతన్యమే మన మందరమూ, ప్రతివారి దేహమునందూ ఈ చైతన్యం ఉన్నది.

'యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణీ'

- మనీషాపంచకం.

ఒక దివ్వె ఉంటే అది వస్తువులను చూడడానికి కుపయోగపడుతుంది. కాని చూడడానికి కన్నులు లేకుంటే దివ్వెతో ఏమిపని? అంతా చీకటే. కన్నులున్నప్పటికీ మనసు లేకపోతే ఆ కన్నులు చూడలేవు. మైకం వచ్చి కింద పడితే కన్నులు తెరచి కొనియే ఉన్నాచూపు మాత్రం ఉండదు. అలాగే మనసు మాత్రం ఉన్నా చాలదు. ఆ మనసులో ఆత్మజ్యోతి అణగి ఉండాలి. ఆత్మజ్యోతి ప్రసారం ఉన్నంతవరకే మనస్సు తలచినా కన్నులు చూచిన దివ్వె వెలుగున వస్తువులచే కనుగొన్నా. దివ్వె మెలునులో జడవస్తువులు కనబడతై. వీని కన్నిటికీ మూలం ఆత్మజ్యోతి. ఆ ఆత్మజ్యోతియే చైతన్యం. చైతన్యం ఒక్కటంటే ఒక్కటే. మెరుపు వెలుగులో వ్యత్యాసం ఏమీ లేదు. ఒక బొత్తాము నొక్కితే చాలు. దివ్వెలన్నీ వెలుగుతవి కాని దివ్వెను బట్టి వెలుగు ఉంటుంది. అట్లే చైతన్యం ఒక్కటే అయినా ఉపాధినిబట్టి పరిపాకాన్నిబట్టి వెలుగులో తేడా ఉంటుంది. ఆత్మజ్యోతిని నిండుగా ప్రకాశింపచేయడానికి, దుఃఖం లేని జీవనం గడపడానికి తగిన సాధనాలను మనకు ఉపదేశించడానికి, మనకు ఆచార్య పరంపరకావాలి. ఒక ఆచార్యులు తమ తరువాతి కాలంలో తాము నిర్దేశించిన పనులు చేయడానికి మరొకరికి తమ అధికార మిచ్చిపోతారు. ఇట్లా వరుసగా ఒకరి తరువాత ఒకరుగా వచ్చినవారే ఆచార్య పరంపర. అట్టి పరంపర యెడల మనము కృతజ్ఞత కలిగియుండాలి. ఆత్మనిధిని సురక్షితముగా మన కిచ్చెడివారు వీరే. ఈ నిధి మన కెవరెవరి మూలముగా ఈ నాటికిని లభ్యమవుతూందో వారి నందరనూ ధ్యానిస్తే మనకు వారి అనుగ్రహమధికంగా కలుగుతుంది. అంచేత ఆత్మతత్త్వ మెరుగగోరేవారందరికీ గురు పరంపరాజ్ఞానం అత్యవసరం.

మన ఆచార్య పరంపరలో పరమగురువు నారాయణుడు. తరువాత బ్రహ్మ. వశిష్ఠులు, శక్తి, పరాశరులు, వ్యాసులు, శుకులు. శుకులవరకూ గురు పరంపర పుత్ర పరంపరగాఉన్నది. శుకుడు పుట్టుకతోనే జ్ఞాని. కనుక వారిపిదప అది శిష్యపరంపరగా ఏర్పడ్డది.

గౌడపాదులు శ్రీ శుకులవద్ద సన్యాసం స్వీకరించి ఆత్మ నిష్ఠయందున్నారు.

నర్మదానదీ తీరంలో ఉన్న చంద్రశర్మ చెట్టుదిగి ఆకుల మూటతో కొంతదూరం వెళ్ళేడు. అతనికి చాలారోజుల నుండి కడుపు తిండి కంటికి కూర్కు లేవు. అందుచే చాలా అలసి ఉన్నాడు. అతడు తన చేతిలోఉన్న ఆకులమూటను తలక్రింద పెట్టుకొని ఒకచోట నిద్రించాడు. ఆ సమీపంలో ఒక గొఱ్ఱ ఆకలములు తింటూ ఉన్నది. అది చంద్రశర్మ తలక్రింద బొత్తిగా ఉన్న ఆకులను చూచి అచటకు చేరి కొన్ని ఆకులు తినివేసింది. అది తినగా మిగిలిన భాగమే నేడున్న మహాభాష్యము. అది తినివేసిన భాగమును అజభక్షితభాష్య మని పిలుస్తారు. చంద్రశర్మ నిద్రనుండి లేచి భాష్యములో కొంత భాగము అజభక్షత మైనందుకు చింతించి మిగిలిన భాగమును చేతబట్టుకొని ఉజ్జయినీ నగరానికి చేరుకొన్నారు.

ఉజ్జయినికి చేరినంతనే చంద్రశర్మను మఠం నిద్ర ఆవహించింది. అతడిచ్చట ఒక వైశ్యుని యింటి అరుగుపై మేను వాల్చాడు. గాఢ నిద్రలో మునిగేడు. అతడు మెలుకవ అన్నది లేక నిద్రిస్తూ ఉన్నాడు.

ఆ వైశ్యుని కొక కూమార్తె ఉన్నది. ఆమె కన్య. తెలివి కలది. ఆమె తమ అరుగుపై ఒడలు తెలియక నిద్రిస్తూఉన్న చంద్రశర్మను చూచింది. కొంతసేపటికి లేస్తాడనుకొన్నది. కాని చంద్రశర్మ లేవలేదు. ఆమె అతనిని మేలుకొలుపుటకు యత్నించింది. కాని చంద్రశర్మకు మెలకువ రాలేదు. ఇతడెవరో తేజస్వి. కాని చాలా కాలంగా ఏ కారణంచేతనో నిద్రాహారములు లేక యీనాడిట్లు నిద్రిస్తున్నాడను కొన్న దామె. అతని ప్రాణములు నెటులైన కాపాడవలెనని ఆ వైశ్యకన్య నిశ్చయించుకొన్నది. కాని ఎలా కాపాడవలెను?

ఆనాడామె పెరుగన్నమును గలిపితెచ్చి యాతనిదేహమునిండా పూసినది. అన్నసారము కొంచెము కొంచెముగా రోమకూపములద్వారా శరీరమున బ్రవేశించ నారంభించినది. ఆమె మరునాడును అటులేచేసినది. కొన్నిదినములిట్లు చేయగా చంద్రశర్మ నూనెలేక క్షీణించుచున్న ద్వీపజ్వాల నూనె పోసినంతనే జ్వలింప నారంభించినట్లు మేల్కొన్నాడు. ఇట్టి చికిత్స మన వైద్య శాస్త్రాలలో చెప్పబడ్డది. నేడు 'ఇంజెక్షనుల' ద్వారా అన్నసారాన్ని శరీరంలోకి ఎక్కించే విధానం ఉన్నది. కాని ఇది హింసతో కూడినది. శరీరమున సూదితో క్రొత్తగా నొక రంధ్రము చేయనిదే యిది సాధ్యం కాదు. కాని పై చికిత్స సులభ##మైనది. సహజమైనది. కేరళ##దేశంలో నేటికిని దీనిని పోలిన చికిత్స ఆచరణలో ఉన్నది.

మెలుకవ రాగానే చంద్రశర్మ మొదట తన ఆకులమూట భద్రంగా ఉన్నదా లేదా అని చూచుకొన్నాడు. అది భద్రంగానే ఉన్నది. అతడా ఆకులను చేతబట్టుకొని మరల బయలుదేరాడు.

గృహయజమాని అయిన వైశ్యుడిది చూచాడు. అతడు చంద్రశర్మ మార్గానికి అడ్డువెళ్ళి-అయ్యా! ఇదేమి? మీరిట్ల వెడలిపోతున్నారు. నాకూతురు కన్య. కడంటిన మీ ప్రాణాలను ఆమె కాపాడింది. ఆమె మీ తేజమును జూచి మనస్సులో మిమ్ము పతిగా వరించి ఎంతయో సేవచేసి మిమ్ము బ్రతికించింది. అందుచే మీరామెను పెండ్లాడక యిట్లు పోవుట ధర్మముకాదు. రండు! ఆమెను పరిణయమాడుడు అని ప్రార్ధించేడు.

అది విని చంద్రశర్మ ఇదేమి! నేను ఉపదేశము పొందుట పెండ్లియాడుటకా? అని తలచుకొని ఆర్యా! మీ కుమారై చేసిన ఉపకారము దొడ్డది. ఆమెకు భగవానుడు మేలుచేయునుగాక! నేనామెను పెండ్లియాడుట జరుగదు. నాకసలు పెండ్లియం దిచ్ఛ లేదు. నన్ను పోనియ్యండి అని ప్రార్థించేడు.

కాని వైశ్యుడు దాని కంగీకరింపలేదు. అతడు చంద్రశర్మతో-అయ్యా! మీ మాటలు ధర్మబద్ధంగా లేవు. నాకూతురు చేసిన ఇంత సేవను ఒక్క ఆశీర్వచనంతో ప్రక్కకు నెట్టి వేస్తున్నారు. ధర్మాధర్మాలను రాజకదా నిర్ణయిస్తాడు. మీరూ నేనూ రాజునొద్దకు పోదాము. అయన చెప్పినట్లు చేద్దాము-అన్నాడు.

చంద్రశర్మ అంగీకరించాడు. వైశ్యడు, చంద్రశర్మ రాజుయొక్క కొలువులో అడుగుపెట్టేరు. రాజు సింహాసనం మీద కూర్చుండి వీరి రాకను గమనిస్తున్నాడు. ఆయనకు చంద్రశర్మ వయోరూపాలు ఆశ్చర్యానందాలను కలిగించేయి. చంద్రశర్మ తేజస్సుకు రాజు ముగ్ధుడైపోయాడు. ఆయనకును ఒక పెండ్లోడు వచ్చిన కన్య ఉన్నది రాజు మనస్సులో ఈ వర్చస్వి తన కల్లుడైతే! అన్న భావం మెదలింది.

అందుచే ఆయన వైశ్యుని వివాదం ఆలకించకుండానే చంద్రశర్మను జూచి అయ్యా! మీరెవరు? మీకు వివాహమైనదా? నా కూతురును మీరు పెండ్లాడాలి! మీకు అంగీకారమేనా? కాని యీ వివాహాన్ని ధర్మశాస్త్రాలు అంగీకరిస్తాయా? అని ప్రశ్నిస్తూ చంద్రశర్మ సమాధానానికి ఎదురుచూడకుండా ఒక సేవకుణ్ణి పిలిచి-పోయి మంత్రిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు.

ఇది చూచి చంద్రశర్మ, వైశ్యుడు నోటమాట లేక నిలువబడ్డారు. రాజాజ్ఞ విన్నంతనే మంత్రి కొలువులోకి వచ్చేడు. ఆ మంత్రి సూక్ష్మబుద్ధి. కొలువులో నిలువబడి ఉన్న యువకుడై తేజస్వియైన చంద్రశర్మను చూడగానే రాజాజ్ఞలోని ఆంతర్యం అవగతం చేసికొన్నాడు. చంద్రశర్మ తేజోమయ రూపానికి ఆతడుకూడ ముగ్ధుడై-తమ రాజ్యానికి ఇది భాగ్యవంతమైనకాలం అనుకొన్నాడు.

ఆయన విషయం అంతా వివరంగా తెలిసికొని చంద్రశర్మ బ్రాహ్మణుడు కనుక తొలుత బ్రాహ్మణకన్యను పెండ్లాడి పిదప క్షత్రియ వైశ్యకన్యలను క్రమంగా పెండ్లాడవచ్చును, ఇది ధర్మశాస్త్రములంగీకరించిన విషయమే-అని చెప్పేడు.

చంద్రశర్మ ఏంచేస్తాడు! ఒక్క వైశ్యకన్యను వదల్చుకొనడానికి చేసినయత్నం ముగ్గురు కన్యలను పెండ్లాడడానికి దారితీసింది. అతడు తన ముగ్గురు భార్యలకు పుత్రోత్పత్తి అయినంతనే తనదారిని తాను పోతానన్నాడు. రాజు దాని కంగీకరించాడు. క్షత్రియ వైశ్యకన్యలు సిద్ధంగానే ఉన్నారు. ఉత్తమకులంలో పుట్టిన బ్రాహ్మణకన్యను వెదకడం వారికి కష్టంకాలేదు. చంద్రశర్మ ముగ్గురు కన్యలనూ పెండ్లాడేడు.

శాస్త్రం మొదటికుమారుని 'ధర్మజుడు' అని, తరువాతి వారికి 'కామజులు' అని పేర్కొన్నది. ధర్మజుడు అంటే ధర్మము ననుసరించి జన్మించినవాడు. అట్టివాడు మొదటి పుత్రుడే. తరువాతి వారు కామంవల్ల జన్మించారు. అందుచేతనే వారు కామజులు. కర్మకు అధికారం జ్యేష్ఠపుత్రునకే శాస్త్రాలు నిర్దేశించాయి. అంతేకాదు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీద ప్రథమ పుత్రునికే అధికారం. ఏమంటే చరస్థిరరూపమైన ధనమంతా ధర్మజుడైన ప్రథమపుత్రునకే ఉన్నది. ఇతరులకు లేదు. ఇతరులకు శరీర సంరక్షణం చేస్తేచాలు. రాజ్యాధికారంకూడా మొదటి కుమారునకే గాని ఇతరులకులేదు. ఇందువల్లనే కేరళ##దేశంలోని నంబూద్రీ బ్రాహ్మణ కుటుంబాలలో నేటికి ఆస్తికి ప్రథమ పుత్రడే హక్కుదారుగా ఉన్నాడు. కాగా కావలసినది ధర్మానుష్ఠాన యోగ్యతకల ఒక్క కుమారుడే. పలుమంది కాదు.

అందుచే చంద్రశర్మ తన వివాహానికి అట్టి నియమము ఏర్పరచాడు. రాజు మంత్రి మొదలగువారు ధర్మజ్ఞులగుటచే ఆ నియమానికే అంగీకరించారు. కొంతకాలానికి చంద్రశర్మకు ముగ్గురు భార్యలయందు ముగ్గురు పుత్రులుదయించారు. వెంటనే చంద్రశర్మ బయలుదేరేడు. అతని అన్వేషణం అంతా తనకు వ్యాకరణం, నేర్పిన గురువును గూర్చి. తన గురువు బదరికాశ్రమంలో సన్యాసియై ఉన్నాడని తెలిసికొని చంద్రశర్మ నెమ్మదిగా పయనించి ఆయన వద్దకు చేరుకొన్నాడు. గురువుననకు నమస్కరించి చంద్రశర్మ తనకుకూడ సన్యాసం అనుగ్రహింపవలసినదని ప్రార్థించాడు. ఆయన శిష్యుని యోగ్యత గుర్తించి అనుగ్రహించారు. సన్యాసం స్వీకరించిన చంద్రశర్మ గోవింద భగవత్పాదాచార్య నామంతో ప్రసిద్ధులయ్యేరు. శ్రీ శుకులకు పిమ్మట వచ్చిన ఆచార్యులకు పరివ్రాజకులన్న పేరు ఏర్పడ్డది.

గోవింద భగత్పాదులవారు గురు సన్నిధానంలో బదరికాశ్రమంలో ఉన్న సమయంలోనే శ్రీ శుకులతో వారికి తండ్రియు గురువునైన వ్యాసులు అచటికి వచ్చేరు. శ్రీ శుకులను వ్యాసులను దర్శించి గోవిందభగవత్పాదులు తాము ధన్యుల మయినామని భావించేరు. గోవింద భగవత్పాదులను చూచి వ్యాసులు-ఓయీ! 'బ్రహ్మసూత్రములను' నేను కూర్చేను. వానికి భాష్యం వ్రాయాలి. ఆ భాష్యం వ్రాయడానికి ఈశ్వరుడే భూమి మీద అవతరిస్తాడు. అలా అవతరించి ఆయన సన్యాసం పుచ్చుకొంటారు. లోకంలోని సంప్రదాయాన్ని నిలువ బెట్టడానికి ఈశ్యరావతారమైనప్పటికి వారికి గురువు అవసరం. అందుచే నీవు నర్మదా తీరంలోఉన్న రావిచెట్టుక్రింద నివసిస్తూ వారి రాకకై నిరీక్షించు. ఆయనరాగానే ఆయనకు ఉపదేశం చెయ్యి. ఇది నీవు చేయవలసిన పని'-అన్నారు.

శ్రీశుకులు, వ్యాసులు, గౌడపాదులు, గోవింద భగవత్పాదులు బదరికాశ్రమంలో సమావిష్టులై చేసిన నిర్ణయమిది.

ఆ నిర్ణయాన్ని అనుసరించి గోవిందభగవత్పాదులవారు నర్మదాతీరానికి బయలుదేరేరు.

ఈ గోవిందభగవత్పాదులకు పూర్వాశ్రమంలో ఏగురువులు వ్యాకరణ శాస్త్రము బోధించారో ఉత్తరాశ్రమంలో వారే యతిధర్మాన్ని అనుగ్రహించారు. అట్లే ఆయన పూర్వాశ్రమంలో ఏవక్షంక్రింద విద్యాగ్రహణం చేశారో ఉత్తరాశ్రమంలో ఆ వృక్షం క్రిందనే నివసిస్తూ శిష్యుని రాకకై ఎదురుచూడసాగేరు.

'నటరాజదర్శనం వల్ల వెన్నుని హృదయం ఆనందంతో నిండింది. అలా ఆనందంతో బరువెక్కిన విష్ణువును ఆదిశేషువు మోయలేకపోయినాడు' అన్నది మొదలు ఇంతవరకు చెప్పిన కథ అంతా 'పతంజలి విజయము' లో చక్కగా వర్ణింపబడ్డది. ఆ గ్రంథం శంకరాచార్య వారియొక్క పూర్వాచార్యపరంపరను శంకరాచార్య చరిత్ర- 'అత్రాంతరే నక్రగ్రహీతపాద-' ఇత్యాదిశ్లోకంతో గోవిందభగవత్పాదులకడకు- దిగ్విజయము- అద్యైతభాష్యరచనము మున్నగు విషయాలు వర్ణింపబడ్డాయి. ఆ కావ్యంలోని చివర శ్లోకం-

గోవింద దేశిక ముపాస్య చిరాయ భక్త్యా

తస్మిన్‌ స్థితే నిజమహిమ్ని విదేహముక్త్యా!

అద్వైతభాష్య ముపకల్ప్య దిశోవిజత్య

1కాంచీపురే స్థితి మవాప సశంకరార్యః||

- పతంజలి చరిత్ర 71.

1 చేయవలసిన పనులన్నీ చేసిన మీదట శంకరాచార్యులవారు కంచిలోనే నివశించి నట్లు పతంజలి చరిత్ర చెపుతోంది.


Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page